నీ పొటెన్షియల్ నీకు తెలుసా?

కొన్ని సంవత్సరాల క్రితం, రెండువేల రెండులో, నేను చాలా డిప్రెషన్లో ఉన్న రోజులవి! మా ఫ్యామిలీ డాక్టర్ నాకొక గిఫ్ట్ పంపారు వాళ్ళ అబ్బాయితో. వాడు నా దగ్గర ట్యూషన్ చదివేవాడు.
అది ఒక డైరీ లాంటిది. లాంటిది అంటే ఒక సంవత్సరానికి సంబంధించిన డైరీలాంటిది కాదు. చూడ్డానికి ఎర్రటి రంగులో, విశాలంగా బావుంది. దానిపైన రాసున్న శీర్షిక నన్ను ఒక్క కుదుపు కుదిపింది. "మై లైఫ్- పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ కెరీర్" ఇది, ఆ డైరీపై రాసి ఉంది. తెగ నచ్చేసింది. లోపలి పేజీలు వెంటనే తిరగెయ్యడం మొదలుపెట్టాను.
మొదటి పేజీలు పర్సనల్ కెరీర్ గురించి...
తర్వాత మనీ మేటర్స్ (ఆర్థిక లావాదేవీలు)
తర్వాత ఫ్యామిలీ గురించి, ఆరోగ్య రికార్డు, చివర్లో జ్నాపకాలుగా గుర్తుండిపోయిన జీవిత సంఘటనలు!

పెద్దగా ఏమీ ఆలోచించకుండానే పెన్ను తీసుకుని ఆ పేజీలు నింపడం మొదలుపెట్టాను. ఒకానొక నిముషంలో నా పెన్ను, నేను కూడా ఆగిపోయాం. అక్కడ ఉన్న అంశాలు అలాంటివి మరి!
నువ్వు సమాజానికి ఎప్పుడు చేయూతనిచ్చావ్?
నీ కెరీర్ గ్రోత్ గురించి వివరించు
నువ్వు పొదుపు చేసిన లేదా ఇన్వెస్ట్ చేసిన డబ్బు గురించి రాయి
నీ కుటుంబంతో నీకున్న అనుబంధానికి నీ కృషి ఎంత?
నీ స్నేహితులు, సన్నిహితులతో నీ సంబంధాలు ఎలా ఉన్నాయి?
నీ ఆరోగ్యం గురించి నువ్వు తీసుకునే జాగ్రత్తలేమిటి?
వీటికి నా దగ్గర సక్రమమైన సమాధానాలు లేవు!

చివరికి పేజీలు తిరగేసి చివర్లో ఇచ్చిన అంశానికేదో జోడిద్దామన్నా, ఏదో రాద్దామనుకున్నా, నా జీవితంలో మధురమైన జ్నాపకాలుగా ఉండిపోదగిన/ ఉండిపోయిన సంఘటనలేవీ లేవు!

నా అచీవ్మెంట్స్ అంటూ పెద్దగా ఏమీ లేవు. సమాజంతో మమేకమౌతూ నేను చేసిన పనులూ లేవు. ఇంకేం రాయాలి? పరుగులు పెడ్తున్న మానవ నాగరికత డిమాండ్ చేసే అంశాలేవీ నా ఖాతాలో చేరనేలేదు!

నా పెన్ను నిస్సహాయంగా ఆగిపోయింది. ఆ మెరుస్తున్న కాగితాలు నన్ను వెక్కిరిస్తూ ఉంటే మిన్నకుండిపోయాను. రాయడానికి ఏమీ లేదు మరి! అప్పటికి నేనొక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిని మాత్రమే! టఫ్ ఫేజ్ వెంట నడుస్తున్నదాన్ని! క్షీణించిన ఆరోగ్యం, మానసిక దౌర్బల్యం తప్ప ఏమీ లేవు నాలో!

ఆ డైరీని నా చేతుల్లోకి తీసుకుని హృదయానికి దగ్గరగా హత్తుకున్నాను. నాలోకి నేను తొంగి చూసుకున్నాను. ఆత్మ పరిశీలన చేసుకున్నాను. అప్పుడే అంతర్దర్శనం అయిందని చెప్పొచ్చు. నన్ను నేను ఒక ప్రశ్న వేసుకున్నాను. "ఈ విశాల ప్రపంచంలో నేను ఏమిటి?" ఈ ఒక్క ప్రశ్న నాలో వివరించలేని గొప్ప తరంగాలను సృష్టించింది. అవి నా మెదడు లోతుల్ని పట్టి కుదిపాయి. అప్పుడే మా డాడీ నా గురించి కన్న కలలు గుర్తుకొచ్చాయి. నా గురించి ఆయన తన స్నేహితులతో చెప్పే మాటలు గుర్తొచ్చాయి.

అప్పటివరకూ గుర్తు రాలేదా? వస్తాయి. కానీ ఒక బాధలోకో, చిన్న జ్నాపకపు అలజడిలోకో నెట్టి, మళ్ళీ నిత్యజీవితపు ఒరవడిలోకి నెట్టేస్తాయి. ఒక్కోసారి ఒక్కో సంఘటన/విషయం మనల్ని పట్టి కుదుపుతుంది. బలమైన కార్యక్షేత్రానికి అక్కడే పునాది పడుతుంది. ఇదీ అంతే!

నేను క్రొత్త మార్గాన్ని చేపట్టాలని అప్పుడనిపించింది. జీవితాన్ని సఫలం చేయగల మార్గం! మానసిక సంతృప్తి శిఖరాన్ని చేరగల ఒక క్రొత్త అల కావాలనిపించింది. ప్రతి క్షణాన్నీ నిజంగా ఆస్వాదించగల జీవన క్రమాన్ని కావాలనుకున్నాను.

ఏదో ఒక స్వప్నం నుండి మేల్కొన్నట్లు, ఒక్క ఉదుటున నా డైరీ తీసుకుని నాకనిపించిన భావాలన్నీ రాయడం మొదలుపెట్టాను. ఏదో శక్తి నాలోకి ప్రవహించడం తెలుస్తూనే ఉంది.

నాలో గూడుకట్టుకున్న డిప్రెషన్ ను సమూలంగా తొలగించాలి. ఇది మొదటి నిర్ణయం. నా బలహీనతలన్నింటినీ ఒక జాబితా రాసాను. వాటన్నింటి పై యుద్ధం ప్రకటించాలి. గెలవాలి. ఇది రెండో నిర్ణయం.  ఒక వస్తవానికి ఇంకో వాస్తవంతో ముడి పెడ్తూ పోయాను. లింక్ ఉంటే ఒకదానితో వదిలెయ్యకుండా ఉండగలనని ఆశ! నిర్ణాయాలు ఎన్నయినా తీసుకుంటాం! అమలు సంగతి ఏమిటి? డిప్రెషన్ అయినా మన బలహీనతలైనా, పారసైట్ల వంటివి. అంత తొందరగా వదిలిపోవు. కానీ వదిలించే నిప్పు మనలో రాజుకున్నాక ఏదైనా సాధ్యమే! మన దుర్బలత్వాన్ని పెంచి పోషించినంతకాలం ఏదైనా మనపై దాడి చేయగలదు. దుర్బలత్వం పై నా యుద్ధం మొదలయ్యింది. సందేహాలను నా నుండి వేరు చేసిన మరుక్షణం నాలో ఉన్న అపూర్వమైన నిధిని నేను కనుగొనగలిగాను.
అదే అనంతమైన సత్యం....మార్పుకు నువ్వే ఆది...నువ్వే అంతం!

ఇప్పుడు నేనొక రైటర్ గా, ఫ్రీలాన్సర్ గా, కవయిత్రిగా ప్రపంచానికి తెలుసు. ఒక క్రొత్త ఫ్రేమ్! శిఖరాలనెక్కడమంటే డబ్బు, పేరు సంపాదించడం కాదు. మనలో మనమే ఉత్కృష్టంగా ఎదగడం. విజయమంటే ప్రాపంచిక గెలుపొకటే కాదు, ముందుగా మన ఆత్మ ముందు మనం నిర్భయంగా, ప్రశాంతంగా నిలబడగల్గడం! నాలో పరిణామం ఒక క్రొత్త జీవితంగా పరిణమించింది. సామజిక సేవకు, సమాజాన్ని చదవడానికి కూడా సమయాన్ని కేటాయించాను. ప్రతి పరిస్థితినీ బ్యాలెన్స్ చెయ్యడం నేర్చుకున్నాక జీవితం సులువైపోయిందని వేరే చెప్పాలా?
ఇది నా కథలో చాలా చిన్న భాగం మాత్రమే! ప్రతి సగటు పౌరుడూ/పౌరురాలు ఎదో ఒకరోజు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. జీవితపు నిరంతర ప్రయాణాంలో ఒక్కసారి ఆగి వెనక్కి చూసుకుంటే, మనం గుర్తుంచుకోదగిన విజయాలు, మనం నిలబడిన ప్రదేశం మనకు వాస్తవాలను చూపించేస్తాయి. ఒక్కసారి మనల్ని జీవితం ప్రశ్నించిందంటే చాలు!

జీవితపు త్రాసును ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకోవడం తప్పనిసరి!

మన పొటెన్షియాలిటీని నిర్లక్ష్యం చేయడం వల్ల ఘాతాలకు బలయ్యేది మనమే! దురదృష్టం అంటూ కుంటి సాకులు చెప్పుకుంటూ పోతే చివరికి మిగిలేది కూడా సాకులే!

మనం ఎక్కడ వెనుకబడ్డాం అన్నది ముందుగా తెలుసుకోవాలి. సామర్థ్యం లేని జీవి ఈ ప్రపంచంలో పుట్టదు. ఇది నమ్మి తీరాల్సిన సత్యం. ఏదో ఒక విషయంలో అమోఘమైన సామర్థ్యం మనలో ఉంటుంది. దాన్ని కనిపెట్టాలి. ఆ అంశంపై కృషి చెయ్యాలి. ప్రావీణ్యతను వృద్ధి చేసుకోవాలి. అసమర్థత మన ఆలోచనలోనే ఉంటుంది. మనలో కాదు. మనల్ని మనం తక్కువ చేసుకోవడం కన్నా పెద్ద తప్పు ఇంకోటి లేదు!

చేదు మన జీవితంలోకి మనం ప్రవేశించనివ్వనిదే ప్రవేశించదు. మీ పొటెన్షియాలిటీని నిరూపించుకోవడానికి నా దగ్గరొక మార్గం ఉంది. ప్రపంచానికి నిరూపించడానికి కాదు. మీకు మీరు తెలుసుకోవడానికి. ఒకసారి మీలో ఎంత సామర్థ్యం ఉందో మీకు తెలిస్తే, ప్రపంచానికి ఇక ఆటోమేటిక్ గా తెలిసే తీరుతుంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు లేవని ఊహించు. ఒక అడుగు మానసికంగా బయటికి వేసి చూడు.
నీ మీద నువ్వొక ఒక చిన్న ప్రయోగాన్ని చేసి చూడొచ్చు.
ఒక పనిని కల్పించుకో! అది తప్పని సరిగా చేసి తీరాల్సిందేనని తీర్మానించుకో!
తప్పించుకునే వీలుండకూడదు.
ఆ పనిని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసాక నీ అనుభవాన్ని డైరీలో రాయి.
మన పరిస్థితులను, జీవన విధానాన్ని దాటి ఒక్కసారి ప్రయత్నిస్తే, చాలా విషయాలు సులభం ఐపోతాయి. ఒక్క అడుగు మాత్రమే దూరం...తరువాత అన్నీ వాటికవే తమ స్థానాల్లోకి సర్దుకుంటాయి.

కోరుకున్న స్వర్గం అందుకోవడం మన చేతిలోనే ఉంది. విజయానికి దారులు చాలా రకాలుండొచ్చు. మన పరిస్థితులకు, మన ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితాలు రావచ్చు. ఒక్కోసారి ముళ్ళదారుల వెంట నడవాల్సి రావచ్చు.

క్రెడిట్ ఎవరికివ్వాలి? నీకే! క్రెడిట్ పూర్తిగా నీకే సొంతం. నింగిని చేరడానికి నీలో దాగి ఉన్న వేరే మనిషి బయటికి రావాలి. రెక్కలు పనిచెయ్యాలంటే ఎగరడానికి ప్రయత్నం తప్పనిసరి. ఇప్పటివరకూ జరిగిన వాటినన్నింటినీ మస్తిష్కం నుండి బయటికి పంపెయ్యాలి.

వెసులుబాటు: (అనుకూలత/సౌకర్యం):
ఇదొక గొప్ప అవాంతరం. వెసులుబాటు ఉండడం వల్ల "టేకిట్ ఫర్ గ్రాంటెడ్" పద్ధతికి అలవాటు పడే అవకాశం ఉంది. వెసులుబాటుకి అవకాశం ఇవ్వద్దు. నేను ఆర్టికల్ రాయడం మొదలుపెట్టినపుడే ఎడిటర్ కి ఫోన్ చేసి చెప్పేస్తాను. ఇంకో రెండు గంటల్లో పంపేస్తున్నానని. అందువల్ల నేను ఆ కమిట్మెంట్ కి కట్టుబడి పని చేస్తాను. పనిని ఆలస్యం చేయను, అలక్ష్యం చేయలేను. ఇదొక టెక్నిక్. ఇలాంటివి ఒక్కొక్కరు ఒక్కోలా ఉపయోగిస్తారు. అల్టిమేట్లీ, మనకు వసులుబాటు ఉండకూడదన్నదే సూత్రం! అర్జునిడిలా మనకు పక్షి కన్ను మాత్రమే కనపడాలి. ఇక ద్రోణాచార్యుడెవరంటే? మన పట్టుదలే!

భవిష్యత్తుతో ప్రేమలో పడండి.
నిర్దేశించుకున్న నియమాలను స్ట్రిక్ట్ గా అమలుపర్చాలి.
వాయిదా పద్ధతిని పూర్తిగా విసర్జించాలి.

"పుట్టిన ప్రతి మనిషి పుట్టుకకూ ఒక ఉద్దేశ్యం ఉంటుంది. నీ పుట్టుకకు పర్పస్ ఏమిటో నీకు తెలిసి తీరాలి!"

మన గురించి మనకు తెలిసినట్లుగా మరెవరికీ తెలియదు. ఇతరులు మనకు సలహా మాత్రమే ఇవ్వగలరు, వారు మనకు ఒక మార్గాన్ని మాత్రమే చూపగలరు. మన సామర్థ్యాలు, మన బలహీనతలు, మన బలాలు...ముఖ్యంగా, మన చిత్తశుద్ధి మనకు మాత్రమే తెలుస్తాయి.
"నీకున్న పొటెన్షియల్ పై దృష్టి పెట్టు. ఏకాగ్రతతో నీ పనిముట్లకు పదును పెట్టు. ఆకలిగొన్న సింహం వలె విజయం వైపు దూకు."