ఆ పాత కథ ఒక తేనె బిందువు ఆత్మగా మారిపోయిన నిత్య ప్రవాహపు సింధువు!


ఆ పాత కథ
ఒక తేనె బిందువు
ఆత్మగా మారిపోయిన నిత్య ప్రవాహపు సింధువు!

అలసిసొలసిన బ్రతుకు పందెంలో
ఆ పాత కథ మూటను విప్పుతాను
అప్పుడప్పుడూ జ్ఞాపకాల చెట్టు నీడన విశ్రమిస్తాను
చెట్టు నుండి రాలిపడే పూలను ఒక్కోటిగా ఏరుకుంటాను
మనసు పొరలకు సమానంగా దాని సుగంధాన్ని పంచేస్తాను!

స్మృతుల వనాలు పరిమళాలను వెదజల్లుతాయి
అప్పటి జీవితపు రూపురేఖలు...సూర్యకిరణాలై వెలుగులు విరజిమ్ముతాయి
తనువంతా నిన్నటి ఉత్సాహం పరుగులెత్తుతుంది
మక్కువగా మమకారంగా జ్ఞాపకాలను హత్తుకుంటుంది
సందర్భం రావాలే కానీ వెనక్కి పరుగెత్తడం మహా ఇష్టం!

మేఘాలను సృష్టించి
తేనె బిందువుల వర్షంలో తడిచిపోతాను
నిన్నటిలోకి మహదానందంగా జారిపోతాను
ఆ పసిడి ఆభరణాలను అలంకరించుకుని మురిసిపోతాను
మనసు నిండిన సంద్రపు అలల ధ్వనిని దృశ్యీకరించుకుని తరించిపోతాను!

ఆ పాత కథ
ఒక తేనె బిందువు
ఆత్మగా మారిపోయిన నిత్య ప్రవాహపు సింధువు!

No comments:

Post a Comment