Showing posts with label నా స్వప్నాలు. Show all posts
Showing posts with label నా స్వప్నాలు. Show all posts

నా స్వప్నాలు!!!


నా స్వప్నాలు!!!
----------------
కనుదోయి గాఢ సుషుప్తిలోకి జారిపోనపుడు

మనోనేత్రంపై ఆవిష్కరించబడ్తాయి నా స్వప్నాలు

రెక్కలు విప్పిన రెప్పల అంచులు
కొలుస్తాయి నింగి గతుల కొలతలు
శిఖరాలు ఎక్కుతుంటాను
తెలియని వలయాలకు చిక్కుతుంటాను
లక్ష్యం ఎప్పుడూ దూరమే
గమనంలో కేరింతలు కొడుతుంటాను
నీ పెత్తనం సాగదంటూ ఎదురుతిరుగుతాయి ఇష్టాలు
బిత్తరపోయిన నన్ను చూసి వెక్కిరిస్తాయి
ఒక్కోసారి అమృత భాండాన్ని చేతికందిస్తాయి
ఒక్కోసారి నా కోరికలను విసిరికొట్టేస్తాయి
ప్రియుడై నా ముంగురులు సవరిస్తాయి ఒకసారి
ఎండమావులై తృష్ణను పెంచేస్త్తాయి మరోసారి
ఒక్కోసారి నీరై నిప్పును ఆర్పేస్తాయి
ఒక్కోసారి నిప్పుల కుంపటిలోకి నిర్దాక్షిణ్యంగా తోసేస్తాయి
ఉదయానికి ప్రశ్నలెన్నో వదిలివెళ్తాయి
నిశిరాత్రి కన్నుకొట్టి మళ్ళీ పిలుస్తాయి
మెదడంతా ఝల్లుమనిపించే మెరుపుతీగలు నా స్వప్నాలు
తపోదీక్షకు మెచ్చి దేవుడిచ్చిన వరాలు నా స్వప్నాలు
జిలుగు మేను వర్ణాలు
పన్నీటి కొలను స్నానాలు
అంతశ్చేతన వెలిగించిన మోహాలు
హిమపాతం సొబగులు అద్దిన మంచు పుష్పాలు
రేయంతా జల్లుగా కురిసే రాగాల చినుకులు నా స్వప్నాలు
ప్రభాతపు కెరటంతో కనుమరుగయ్యే విచిత్ర దృశ్యాలు నా స్వప్నాలు!!!